మత సామరస్యానికి ప్రతీకగా భావించే నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మరోసారి భక్తి, విశ్వాసాలతో ప్రారంభమైంది. స్వర్ణాల చెరువు వద్ద జరిగే ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక ఉత్సవానికి రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. కోర్కెలు నెరవేరాలనే విశ్వాసంతో రొట్టెలను పరస్పరం మార్పిడి చేసుకునే ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది.
ఈ ఏడాది రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. జూన్ 26 నుంచి 30 వరకు ఐదు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజే సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రి నారాయణ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఎస్పీ అజిత వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖలకు సూచనలు చేస్తున్నారు.
భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య సేవలను కూడా బలోపేతం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి కేంద్రాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
స్వర్ణాల చెరువులో భక్తులు పెద్ద సంఖ్యలో దిగే నేపథ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మత్స్యశాఖ జేడీ చాంద్ బాషా ఆధ్వర్యంలో 15 బోట్లను అందుబాటులో ఉంచారు. ప్రతి షిఫ్ట్‌లో 15 మంది గజఈతగాళ్లను విధుల్లో నియమించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. చెరువు పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
రొట్టెల పండుగలో భక్తులు తమ కోరికలకు అనుగుణంగా వివిధ పేర్లతో రొట్టెలను పరస్పరం మార్పిడి చేసుకుంటారు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఐశ్వర్యం వంటి కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి రొట్టెలు సమర్పించడం ఈ ఉత్సవ ప్రత్యేకతగా భావిస్తారు. అందుకే ప్రతి ఏడాది లక్షలాది మంది ఈ వేడుకలో పాల్గొంటారు.
మత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే ఈ ఉత్సవం నెల్లూరుకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. శాంతి, సామరస్యం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన రొట్టెల పండుగ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా కొనసాగుతోంది.
నెల్లూరులో రొట్టెల పండుగ సందడి.. స్వర్ణాల చెరువుకు భక్తుల వెల్లువ
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan