ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
దాదాపు 80కిపైగా అజెండా అంశాలు కేబినెట్ ముందుకు రానుండగా, వాటిలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అమరావతి నిర్మాణం, ఐటీ రంగం, పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా ఉన్నాయి.
పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన రూ.34 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటి ద్వారా సుమారు 35 వేల ఉద్యోగాలు లభించే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఉండవల్లి ప్రాంతంలో రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, రూ.130 కోట్లతో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సంబంధించిన అంశాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి.
అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ప్రభుత్వ రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన కూడా కీలకంగా మారింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భాగంగా అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఏపీ కేబినెట్ భేటీ.. పెట్టుబడులు, ఉద్యోగాలపై కీలక నిర్ణయాలు
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan