రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం, ముఖ్యంగా మార్కాపురం నుంచి విజయవాడ వరకు జరిగిన పరిణామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.
విచారణాధికారి ఏసీపీ దైవ ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం టాస్క్‌ఫోర్స్ పోలీసుల పాత్రను లోతుగా పరిశీలిస్తోంది. నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు కోసం టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ నవీన్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు మార్కాపురం వెళ్లినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు సమాచారం. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న అనంతరం ఒక ప్రైవేట్ వాహనంలో విజయవాడకు తరలించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారి, ఎస్ఐ నవీన్‌తో పాటు సంబంధిత కానిస్టేబుళ్లను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. వారి స్టేట్‌మెంట్లను కూడా అధికారికంగా నమోదు చేశారు. ఈ కేసులో కీలక ప్రశ్నలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ముఖ్యంగా, ప్రైవేట్ వాహనంలో మార్కాపురం వెళ్లడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయనే అంశం విచారణలో ప్రధానంగా మారింది. అలాగే సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎవరికి అప్పగించారు? ఆ సమయంలో ఏ విధమైన విధానాలు పాటించబడ్డాయి? అనే కోణాల్లో అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
ఇక క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్న దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత పోలీస్ స్టేషన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మార్కాపురం లింక్‌పై ఫోకస్
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan