దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. కేతన్ హత్యకు ముందు బాలి వెళ్లే ప్రణాళిక రద్దు కావడానికి కారణమైన పాస్‌పోర్టు అదృశ్యం ఇప్పుడు కేసులో కీలక అంశంగా మారింది. దర్యాప్తు బృందాలు ఈ పరిణామాన్ని హత్య కేసుతో అనుసంధానం చేస్తూ పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి.
దర్యాప్తు వివరాల ప్రకారం, జూన్ 6న కేతన్, సియా బాలి వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు ముంబయి విమానాశ్రయానికి బయలుదేరారు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత కేతన్ పాస్‌పోర్టు కనిపించకపోవడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకుని తిరిగి వెళ్లినట్లు సమాచారం.
ఈ ఘటనపై క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రస్తుతం దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. అతని వాంగ్మూలం ప్రకారం, ప్రయాణం ప్రారంభానికి ముందు సియా, ఆమె సోదరుడు సాహిల్ మధ్య వాగ్వాదం జరిగినట్లు తాను గమనించాడని తెలిపాడు. అలాగే టీ తాగేందుకు ఆపిన సమయంలో కారు బూట్‌ను తెరవమని సియా కోరిందని, అనంతరం ఆమె తన పర్సులోంచి ఏదో వస్తువు తీసుకున్నట్లు కనిపించిందని పేర్కొన్నాడు. అయితే అది ఏమిటో తనకు తెలియదని కూడా స్పష్టం చేశాడు.
ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత కారు లోపల ఒక చిన్న బ్యాగ్ మరిచిపోయినట్లు ఫోన్ రావడంతో డ్రైవర్ తిరిగి వెళ్లి బ్యాగ్‌ను అందజేశాడని తెలిపాడు. అనంతరం కేతన్ పాస్‌పోర్టు కనిపించడం లేదని మరోసారి సమాచారం అందడంతో కారును పూర్తిగా తనిఖీ చేసినా అది లభించలేదని వివరించాడు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, కేతన్ బాలి ప్రయాణాన్ని అడ్డుకునేందుకే పాస్‌పోర్టు ఉద్దేశపూర్వకంగా మాయం చేసి ఉండొచ్చా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా తుది నిర్ధారణ వెలువడలేదు. కేసులో నమోదైన ఆరోపణలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి.
మరోవైపు కేతన్ తండ్రి కూడా పాస్‌పోర్టు అదృశ్యంపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రయాణానికి ముందు అందరూ తమ పాస్‌పోర్టులను ఒకే పర్సులో ఉంచుకున్నారని, కానీ కేవలం కేతన్ పాస్‌పోర్టు మాత్రమే కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ వాంగ్మూలం, పాస్‌పోర్టు అదృశ్యం, బాలి ప్రయాణం రద్దు వంటి అంశాలపై పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసులో వాస్తవ పరిస్థితులు అధికారిక దర్యాప్తు పూర్తయ్యాకే స్పష్టమయ్యే అవకాశం ఉంది.
కేతన్ కేసులో కొత్త మలుపు.. పాస్‌పోర్టు మాయం వెనుక కుట్ర కోణం?
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan