ఫిఫా ప్రపంచకప్‌లో సహ ఆతిథ్య దేశమైన కెనడా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని నమోదు చేసింది. లాస్‌ఏంజెలెస్ స్టేడియంలో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 1-0తో విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్ నాకౌట్ దశలో గెలిచిన జట్టుగా నిలిచింది.
మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లు సమానంగా పోరాడాయి. కెనడా వరుస దాడులతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాగా, దక్షిణాఫ్రికా కూడా కౌంటర్ ఎటాక్స్‌తో అవకాశాలు వెతికింది. అయినప్పటికీ నిర్ణీత సమయం వరకు గోల్ నమోదు కాలేదు.
మ్యాచ్ అదనపు సమయంలోకి వెళ్లిన తర్వాత 90+2వ నిమిషంలో స్టీఫెన్ అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మార్చి కెనడా అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు. ఆ ఒక్క గోల్‌తో కెనడా రౌండ్-16లోకి దూసుకెళ్లింది.
మ్యాచ్‌లో కెనడా ఏడు షాట్లు గోల్‌పోస్ట్ వైపు పంపగా, దక్షిణాఫ్రికా రెండు ప్రయత్నాలకే పరిమితమైంది. బంతిపై 58 శాతం నియంత్రణ దక్షిణాఫ్రికా వద్ద ఉన్నప్పటికీ దానిని విజయంగా మలచుకోలేకపోయింది. కెనడా ఆటగాళ్లకు రెండు యెల్లో కార్డులు నమోదయ్యాయి.
లీగ్ దశలో ఆశించిన స్థాయిలో రాణించని కెనడా నాకౌట్‌లో మాత్రం పూర్తిగా మారిపోయిన జట్టుగా కనిపించింది. ముఖ్యంగా రక్షణ, కౌంటర్ ఎటాక్స్, చివరి వరకు పోరాడే తత్వంతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఇప్పుడు జులై 4న నెదర్లాండ్స్-మొరాకో మ్యాచ్ విజేతతో జరిగే రౌండ్-16 పోరులో మరో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
దక్షిణాఫ్రికాపై కెనడా చరిత్ర.. తొలి నాకౌట్ విజయం
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan