ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక రహదారి ప్రాజెక్టుల్లో ఒకటైన కోడూరు–ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. బెంగళూరు–కడప–విజయవాడ (బీకేవీ) ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే బెంగళూరు నుంచి అమరావతి, విజయవాడ ప్రాంతాలకు చేరుకునే సమయం గణనీయంగా తగ్గనుంది.
ఈ ప్రాజెక్టును భారతమాల పరియోజన తొలి దశ కింద సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కోడూరు వద్ద ప్రారంభమయ్యే ఈ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు 343.24 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. అక్కడి నుంచి ఇప్పటికే ఉన్న చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి ద్వారా విజయవాడకు అనుసంధానం ఉంటుంది.
ప్రస్తుతం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోవడానికి సుమారు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రవాణా, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఈ కారిడార్ కీలకంగా మారనుంది.
ఈ హైవే శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా నిర్మిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రహదారి పనులు ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. పుట్టపర్తి సమీపంలో కొండలను తొలిచే పనులు కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో బీటీ లేయర్ వేస్తున్నారు. రైల్వే వంతెనల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.
వైఎస్సార్ కడప జిల్లాలో పెన్నా, కుందూ నదులపై భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ సమస్యల కారణంగా పనులు స్వల్పంగా ఆలస్యమవుతున్నప్పటికీ, మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణం కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలోని పలు ప్యాకేజీల్లో రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి.
ఈ ప్రాజెక్టులో మొత్తం 5.31 కిలోమీటర్ల పొడవుతో ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లా సరిహద్దులో నిర్మిస్తున్న 3.67 కిలోమీటర్ల సొరంగం ఈ ప్రాజెక్టులోనే అతిపెద్దది. ఈ సొరంగాలు పూర్తయితే కొండ ప్రాంతాల్లో ప్రయాణం మరింత సులభంగా మారనుంది.
వచ్చే ఏడాది జూన్ లేదా జులై నాటికి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు ప్రారంభించాలని లక్ష్యంగా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య రోడ్డు అనుసంధానం మరింత మెరుగుపడటంతో పాటు వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటకం, సరకు రవాణాకు కూడా గణనీయమైన ఊతం లభించనుంది.
బెంగళూరు–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే వేగంగా.. వచ్చే ఏడాది ప్రారంభ లక్ష్యం
2
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan