రైతుభరోసా పథకం అమలుపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాల్సిన కార్యక్రమానికి బహిరంగ సభలు నిర్వహించడం వెనుక ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఉపయోగం లేదని ఆయన ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందించిన కేటీఆర్, రైతుభరోసా నిధులు విడుదల చేయడానికి ఒక్క బటన్ నొక్కితే సరిపోతుందని, దానికి కూడా సభలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని ప్రచార కార్యక్రమాల కోసం వినియోగిస్తోందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతులను నిరాశపరిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుభరోసా అమలులో ఆలస్యం చేయడంతో పాటు, రైతుల ఆశలను కూడా వమ్ము చేసిందని ఆరోపించారు.
రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని ఆయన అన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ హామీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజాసభలు, ఢిల్లీ పర్యటనలకు ఖర్చు చేస్తున్న నిధులను రైతు సంక్షేమానికి వినియోగించి ఉంటే రైతులకు మరింత ప్రయోజనం చేకూరేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతుబంధు ద్వారా 11 విడతల్లో సుమారు రూ.73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని రైతులు ఎప్పటికీ మర్చిపోరని, రైతుభరోసా విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతుభరోసాపై సభలేనా?.. కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
4
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan