విశాఖపట్నంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి కాన్వొకేషన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. దేశాభివృద్ధి అందరికీ సమానంగా చేరాలంటే గిరిజన యువత విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ప్రభుత్వం గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్న రాష్ట్రపతి, ఆ కార్యక్రమాలను ఫలప్రదంగా మార్చే బాధ్యత కూడా యువతపై ఉందన్నారు. "ప్రభుత్వం నాకు ఇంత చేస్తున్నప్పుడు సమాజం కోసం నేను ఏమి చేయాలి?" అనే ఆలోచన ప్రతి విద్యార్థిలో ఉండాలని సూచించారు.
విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక స్వావలంబన, సామాజిక బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగత విజయమే కాకుండా సమాజ అభ్యున్నతి కోసం కూడా ప్రతి పట్టభద్రుడు కృషి చేయాలని అన్నారు.
దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో సంప్రదాయ వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునిక విజ్ఞానాన్ని ప్రతి వర్గానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 'సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్'ను రాష్ట్రపతి అభినందించారు.
గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, శక్తి పరిరక్షణ వంటి అంశాలపై విశ్వవిద్యాలయం చేపడుతున్న పరిశోధనలు అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సమగ్ర విద్య, గిరిజన సాధికారతను సమన్వయం చేస్తూ దేశాభివృద్ధిలో యువత ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
గిరిజన యువతే మార్పుకు నాయకత్వం వహించాలి.. రాష్ట్రపతి ముర్ము పిలుపు
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan