మార్కాపురం జిల్లా పరిధిలోని అర్ధవీడు మండలం బొల్లుపల్లి సమీపంలోని అల్లూరేణికుంట వద్ద పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు కారణమైంది. అటవీ ప్రాంతానికి సమీపంలో పులి కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో గ్రామ ప్రజలు అప్రమత్తమయ్యారు.
గత నెల 28న మేతకు వెళ్లిన ఓ గేదెను పెద్దపులి చంపి తిన్నట్లు గుర్తించారు. గేదె కనిపించకపోవడంతో యజమాని పరిసర ప్రాంతాల్లో వెతకగా దాని కళేబరం కనిపించింది. దీంతో పెద్దపులి సంచారం విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, పశువుల కాపరులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పులి సంచరిస్తున్న మార్గాలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. అల్లూరేణికుంట పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను పరిశీలిస్తున్నారు. పులి కదలికలపై స్పష్టత వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అటవీ ప్రాంతానికి సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా అడవి వైపు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. పులి సంచారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పరిసర గ్రామాల్లో ఆందోళన మరింత పెరిగింది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ పులి కదలికలను గుర్తించే పనిలో ఉన్నారు.
మార్కాపురం అర్ధవీడు మండలంలో పెద్దపులి సంచారం.. గ్రామాల్లో పెరిగిన ఆందోళన
13
Published: 📅
Reported by: 🖊
Banu Prakash