కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై కొనసాగుతున్న న్యాయ వివాదంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌కు తాత్కాలిక ఉపశమనం లభించింది.
జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. బాధిత కుటుంబాలకు నగదు రూపంలో సాయం చేస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తారా? అని పిటిషనర్లను ప్రశ్నించింది. కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గతేడాది టీవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సభలో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు మృతి చెందారు. అనంతరం తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ జీవో జారీ చేసింది.
అయితే ఈ జీవోను మద్రాస్ హైకోర్టు జులై 27న రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇతర కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారి హక్కులను పక్కన పెట్టి ప్రత్యేకంగా ఒక ఘటనకు సంబంధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం సరికాదని పేర్కొంది.
ప్రభుత్వం ఆర్టికల్ 162 ప్రకారం అధికారాలను ఉపయోగించిందన్న వాదనను కూడా హైకోర్టు తిరస్కరించింది. అయితే సుప్రీం కోర్టు ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో ఉద్యోగాల అంశంపై తాత్కాలికంగా అమలు కొనసాగనుంది. ఈ కేసులో తదుపరి విచారణలో పూర్తి స్థాయి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలపై సుప్రీం కోర్టు స్టే.. విజయ్‌కు ఊరట
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan