కువైట్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రవాసులకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026పై అవగాహన కల్పించేందుకు APNRTS ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నిర్వాహకుల వివరాల ప్రకారం ప్రవాస భారతీయులు, ఓటర్లు, తెలుగు సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమావేశంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో పేరు పరిశీలన, పేర్లు–చిరునామాలు–ఇతర వివరాల సవరణ, మరణించిన లేదా అనర్హులైన వారి పేర్ల తొలగింపు, BLOల పాత్ర, ఆన్‌లైన్–ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలపై వివరణ ఇచ్చారు. సరైన ఓటరు జాబితా ఎన్నికల పారదర్శకతకు, ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని నాయకులు పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం అధికారిక ఓటరు సేవల పోర్టల్‌లో SIR–2026 ఎన్యూమరేషన్ సదుపాయంతోపాటు వివిధ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ కొత్త ఓటరు Form 6, ప్రవాస భారతీయుడు Form 6A, ఓటరు పేరుపై అభ్యంతరం లేదా తొలగింపునకు Form 7, చిరునామా మార్పు లేదా వివరాల సవరణకు Form 8ను ఉపయోగించవచ్చు.
ప్రవాస ఓటరుగా నమోదు కావడానికి వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. ఉద్యోగం, విద్య లేదా ఇతర కారణాలతో విదేశాల్లో నివసిస్తూ, మరో దేశ పౌరసత్వం పొందని వారు మాత్రమే ఈ విభాగంలో అర్హులు. దరఖాస్తుదారుడి పాస్‌పోర్టులో ఉన్న భారత చిరునామాకు సంబంధించిన నియోజకవర్గంలో పేరు నమోదు చేస్తారు.
విదేశీ పౌరసత్వం పొందిన వ్యక్తి భారత ఓటరు జాబితాలో కొనసాగేందుకు అర్హుడు కాదు. అలాగే కేవలం భారత సంతతి లేదా OCI హోదా ఉన్నంత మాత్రాన ఓటరు నమోదు సాధ్యం కాదు. భారత పౌరసత్వం కొనసాగుతుండటం తప్పనిసరి.
ప్రవాస ఓటరుగా నమోదు అయిన తర్వాత కూడా ఆన్‌లైన్‌లో లేదా విదేశం నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ప్రస్తుతం లేదు. ఎన్నికల రోజున సంబంధిత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి స్వయంగా వెళ్లి అసలు పాస్‌పోర్టును చూపించి ఓటు వేయాలి. ప్రవాస ఓటరుకు ప్రత్యేక EPIC జారీ చేయరని ఎన్నికల సంఘం పేర్కొంది.
ముఖ్య అతిథులు ములకల సుబ్బారాయుడు, దరూర్ బలరాం నాయుడు మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులు తమ ఓటరు నమోదు స్థితిని పరిశీలించడంతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్వగ్రామ ప్రజలకు కూడా SIR–2026పై అవగాహన కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో గున్నం శ్రీనివాసులు, రాచూరి మోహన్, ఓలేటి దివాకర్ నాయుడు, ముస్తాక్ ఖాన్, సత్యసాయిబాబా, దొడ్డిపల్లి సుబ్బరాజు, ఈశ్వర్ చాపలమడుగు, మహబూబ్ బాషా, రాజశేఖర్ యాదవ్, ప్రసాద్, మహేందర్‌నాథ్, హరీష్, ములకల రవి, వంశీ కపెర్ల, సికందర్, నాగేశ్ నాయుడు, భాస్కర్ తదితరులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
APNRTS గల్ఫ్ రీజనల్ కోఆర్డినేటర్లు ఓలేటి దివాకర్ నాయుడు, ముస్తాక్ ఖాన్, NRI టీడీపీ సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాచూరి మోహన్ సమన్వయంతో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరింత మంది ప్రవాసాంధ్రులకు SIR–2026 ప్రక్రియను వివరించేందుకు భవిష్యత్తులో అదనపు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రవాసాంధ్రుల ఓటు హక్కుపై కువైట్‌లో ప్రత్యేక అవగాహన సమావేశం
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan