ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు మరణించినట్లు సమాచారం. సుమారు 50 మంది వరకు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం శిథిలాల మధ్య చిక్కుకున్న ఓ విద్యార్థి వీడియో కాల్ ద్వారా సహాయం కోరడం కలకలం రేపింది. కాంక్రీట్ శకలాల మధ్య ముఖంపై గాయాలతో కనిపించిన విద్యార్థి తనను రక్షించాలని కోరాడు.
ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో భవనం కూలినట్లు కథనం పేర్కొంది. ఈ భవనం దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించబడిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా బేస్‌మెంట్‌లోకి నీరు చేరి పునాది బలహీనపడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకు 11 మందిని శిథిలాల నుంచి వెలికితీసినట్లు సమాచారం. శిథిలాల కింద ఉన్న కొందరు మొబైల్ ఫోన్ల ద్వారా సహాయక సిబ్బందిని సంప్రదిస్తున్నారని అధికారులు తెలిపారు. వారితో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారు. హాస్టల్‌లో ఉన్న వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, హర్యానా, కేరళ రాష్ట్రాలకు చెందినవారని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం అధికారిక విచారణ అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీలో హాస్టల్ భవనం కూలి విషాదం.. శిథిలాల మధ్య నుంచి విద్యార్థి వీడియో కాల్
15
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan