వరలక్ష్మీ శ్రావణ శుక్రవారం చివరి వారాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పాదగయలో భక్తి వాతావరణం నెలకొంది. శ్రీపురుహూతికా దేవి అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో వారు సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో దాదాపు 12 వేల మంది మహిళలు పాల్గొన్నట్లు సమాచారం. వ్రతానికి వచ్చిన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, చీర, రూపుతో కూడిన కానుకలను అందించారు. ఆలయ పరిసరాలు మహిళా భక్తులతో కిటకిటలాడాయి.
అంతకుముందు శ్రీపురుహూతికా దేవి అమ్మవారికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కేకే పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పెండెం దొరబాబు, తుమ్మలబాబు తదితరులు పాల్గొన్నారు.
చివరి శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ పెరుగుతుందని ముందుగానే అంచనా వేసిన ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతం ఆచరించేందుకు వచ్చిన మహిళలను ఐదు బ్యాచ్‌లుగా విభజించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పాదగయ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో పదవదిగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు పొందింది.
పిఠాపురం అసెంబ్లీ స్థానానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
పిఠాపురం పాదగయలో భక్తుల సందడి.. 12 వేల మంది మహిళల సామూహిక వరలక్ష్మీ వ్రతం
15
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan