ఆన్‌లైన్ మోసాలు, నకిలీ గుర్తింపులు, ఫిషింగ్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్‌లపై నిఘా మరింత పెంచింది. వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసిన అనంతరం ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలకు కూడా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు పంపింది.
ఫోన్ నంబర్‌ను పంచుకోకుండా ప్రత్యేక యూజర్‌నేమ్ ద్వారా ఇతరులతో కనెక్ట్ అయ్యే సదుపాయంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల మోసగాళ్లు నకిలీ గుర్తింపులతో అమాయకులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
టెలిగ్రామ్‌లో ఇప్పటికే యూజర్‌నేమ్ ఫీచర్ అమల్లో ఉండగా, దానిని కొనసాగించాల్సిన అవసరం ఏమిటో వివరించాలని కేంద్రం ప్రశ్నించింది. అలాగే సిగ్నల్ యాజమాన్యాన్ని కూడా ఇదే అంశంపై వివరణ కోరింది. వాట్సాప్ మాత్రం ఈ ఫీచర్‌ను ఇటీవల ప్రకటించగా, ప్రభుత్వ సూచన మేరకు తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం సూచించింది.
వాట్సాప్‌కు పంపిన నోటీసులో యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఫిషింగ్ దాడులు, వ్యక్తిగత గుర్తింపుల దుర్వినియోగం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంపై పూర్తి సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఫీచర్‌ను అమలు చేయవద్దని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్టై (Arattai) నియంత్రణ మార్పులకు అనుగుణంగా యూజర్‌నేమ్ ఆధారిత అకౌంట్ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
గత కొన్ని నెలలుగా టెలిగ్రామ్ కూడా భారత ప్రభుత్వ నిఘాలో ఉంది. నకిలీ సమాచారం, మోసాలు, పరీక్షా పేపర్ల లీకులు వంటి అంశాల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇప్పుడు యూజర్‌నేమ్ ఫీచర్‌పై కూడా కేంద్రం భద్రతా కోణంలో పరిశీలన కొనసాగిస్తోంది.
వాట్సాప్ తర్వాత టెలిగ్రామ్, సిగ్నల్‌కూ కేంద్రం నోటీసులు
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan