జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయ ప్రాంతంలో ఉన్న పవిత్ర అమర్‌నాథ్ గుహాలయ వార్షిక యాత్ర శుక్రవారం అధికారికంగా ప్రారంభమైంది. బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంప్‌ల నుంచి తొలి విడత భక్తులు పవిత్ర గుహాలయం వైపు ప్రయాణం ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందే అధికారులు మార్గాలను పరిశీలించి భక్తుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.
బాల్తాల్ మార్గంలో స్వల్ప వర్షం, చలి నెలకొన్నప్పటికీ యాత్ర సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తొలి రోజు సుమారు 10 వేల మంది భక్తులు ఈ మార్గం ద్వారా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణ పరిస్థితులు మారితే వెంటనే ఆశ్రయం పొందేందుకు అత్యవసర కేంద్రాలు కూడా సిద్ధం చేశారు.
యాత్ర ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భక్తులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అమర్‌నాథ్ యాత్ర భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొంటూ భక్తులు క్రమశిక్షణతో యాత్ర కొనసాగించాలని కోరారు. పరిశుభ్రత, పరిపాలన సూచనల పాటింపు, స్థానిక వస్తువుల కొనుగోలు, 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించడం వంటి ఐదు సంకల్పాలను స్వీకరించాలని సూచించారు.
భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు యాత్ర విజయవంతంగా సాగేందుకు సేవలందిస్తున్నారని ప్రధాని అభినందించారు. వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా యాత్రికులు అధికారుల సూచనలు, భద్రతా మార్గదర్శకాలను పాటిస్తూ సురక్షితంగా యాత్ర కొనసాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan