ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాకు సంబంధించిన వీడియో తాత్కాలికంగా నిలిపివేయబడిన ఘటనపై మెటా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ నిర్వహిస్తున్న మెటా సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
మెటా గ్లోబల్ ఎఫైర్స్ చీఫ్ జోయల్ కప్లాన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మొదట ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో సమావేశమైంది. అనంతరం కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ సమావేశాల వివరాలను మెటా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం.. వీడియో తాత్కాలికంగా నిలిపివేత ఘటనపై మెటా ప్రతినిధులు విచారం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.
మోదీ వీడియో ఘటన నేపథ్యంలో కేంద్రం సోషల్ మీడియా వేదికల కంటెంట్ నిర్వహణ విధానంపై ప్రశ్నలు లేవనెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోలు, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను అడ్డుకోవడంలో తీసుకుంటున్న చర్యలపై మెటాను వివరణ కోరినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా సంస్థలు అల్గారిథంల ద్వారా వినియోగదారులకు కంటెంట్‌ను సిఫారసు చేస్తున్న నేపథ్యంలో వాటి బాధ్యతపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. భారత ఐటీ చట్టాల ప్రకారం మెటాకు లభించే తటస్థ మధ్యవర్తి (Neutral Intermediary) హోదా, సేఫ్‌హార్బర్ రక్షణ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎంచుకున్న వినియోగదారులకు కొన్ని అక్రమ కంటెంట్‌లు చేరుతున్నాయనే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలువడింది. చెల్లింపులు తీసుకుని కంటెంట్ ప్రమోషన్ జరుగుతోందా అనే అంశంపై మెటాను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ అంశాలపై మెటా నుంచి పూర్తి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సోషల్ మీడియా వేదికల్లో కంటెంట్ నియంత్రణ, పారదర్శకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
మోదీ వీడియో బ్లాక్ ఘటనపై మెటా క్షమాపణలు.. కేంద్రంతో భేటీ
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan