నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల ఆందోళనల అంశంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన అధికారిక లేఖ రాశారు.
బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనే నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని అమిత్ షా తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026పై సుదీర్ఘ చర్చ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు.
ఆ సమయంలో విపక్ష సభ్యులు నీట్ పరీక్షల అంశాన్ని ప్రస్తావించలేదని, అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరోసారి ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
విపక్ష నాయకులతో చర్చించి, అవసరమైనంత సమయం కేటాయించాలని స్పీకర్‌ను కోరిన అమిత్ షా.. తాను స్వయంగా సభలో పాల్గొని విద్యార్థుల సమస్యలు, విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో చర్చలు, సంభాషణల ద్వారానే పరిష్కారాలు లభిస్తాయని అమిత్ షా అన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా పార్లమెంట్‌లో సానుకూల వాతావరణం కల్పించాలని ఆయన కోరారు.
నీట్ వివాదంపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం.. స్పీకర్‌కు అమిత్ షా లేఖ
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan