అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా విధించిన దిగుమతి సుంకాలపై మరో న్యాయపోరాటం మొదలైంది. డెమోక్రటిక్ పార్టీ అటార్నీ జనరల్స్ లేదా గవర్నర్లు ఉన్న 25 రాష్ట్రాలు కలిసి న్యూయార్క్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ సుంకాలు విధించే క్రమంలో ట్రంప్ ప్రభుత్వం తన చట్టపరమైన అధికార పరిధిని దాటిందని రాష్ట్రాలు ఆరోపించాయి.
వెట్టిచాకిరీతో తయారైన ఉత్పత్తుల దిగుమతులను నిషేధించడంలో విఫలమయ్యాయనే కారణంతో 59 దేశాలు, యూరోపియన్ యూనియన్‌పై అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం సెక్షన్ 301 కింద చర్యలు చేపట్టింది. జూలై 24 నుంచి వివిధ దేశాల ఉత్పత్తులపై 10 లేదా 12.5 శాతం అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. అయితే ముడి పదార్థాలు, అమెరికాలో తగినంతగా ఉత్పత్తి చేయలేని వస్తువులు సహా కొన్ని ఉత్పత్తులకు మినహాయింపులు ఉన్నాయి.
భారత్ వెట్టిచాకిరీతో తయారైన వస్తువుల దిగుమతులను నిషేధించే విధానాన్ని స్వీకరించినట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం పేర్కొంది. దీంతో భారత్‌ను 10 శాతం సుంకం వర్తించే దేశాల జాబితాలో చేర్చింది. మొదట ప్రతిపాదించిన రేటు 12.5 శాతం కాగా, తుది ఉత్తర్వుల్లో భారత్‌కు 10 శాతం నిర్ణయించారు.
సెక్షన్ 301 సాధారణంగా నిర్దిష్ట దేశం లేదా అన్యాయ వాణిజ్య విధానంపై లక్ష్యిత చర్యలకు ఉపయోగిస్తారని, దాదాపు అన్ని దిగుమతులపై ఒకేసారి సుంకాలు విధించడం చట్ట ఉద్దేశానికి విరుద్ధమని పిటిషనర్లు వాదిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ చర్యలు చట్టబద్ధమైనవని, అమెరికా కార్మికులు మరియు వాణిజ్యాన్ని రక్షించడానికి అవసరమని చెబుతోంది. దీనిపై కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.
ట్రంప్ కొత్త సుంకాలపై 25 రాష్ట్రాల న్యాయపోరాటం
3
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati