ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ–గాయత్రి గోపిచంద్ కీలక విజయాన్ని నమోదు చేశారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో జపాన్‌కు చెందిన రెన్ ఇవానగా–కీ నకనిషి జోడీపై 21-16, 21-12తో వరుస గేమ్‌లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లారు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న భారత జోడీ మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ట్రీసా జాలీ పవర్‌ఫుల్ జంప్ స్మాష్‌లతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచగా, గాయత్రి గోపిచంద్ ఫ్రంట్ కోర్టులో సమర్థంగా ఆడి పాయింట్లను నిర్మించారు. వీరిద్దరి కోర్టు రొటేషన్స్ కూడా ప్రత్యర్థి జోడీని ఇబ్బందులకు గురిచేశాయి.
మ్యాచ్ మధ్యలో లైన్ కాల్స్ విషయంలో అంపైర్‌తో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. షటిల్‌ను ఉద్దేశపూర్వకంగా కొట్టినందుకు ట్రీసాకు ఎల్లో కార్డు కూడా లభించింది. అయితే కోచ్ పుల్లెల గోపీచంద్ సూచనలతో భారత జోడీ ప్రశాంతంగా వ్యవహరించి మ్యాచ్‌పై దృష్టి కొనసాగించింది.
చైనాతో కీలక పోరుక్వార్టర్ ఫైనల్‌లో గాయత్రి–ట్రీసా జోడీ ప్రపంచ నాలుగో ర్యాంక్ చైనా జోడీ జియా యి ఫాన్–జాంగ్ షు షియాన్‌తో తలపడనుంది. గతంలో ఈ జోడీతో భారత్ మూడుసార్లు తలపడినా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.
అయితే ప్రస్తుత ఫామ్‌ను కొనసాగించి చైనా జోడీని ఓడిస్తే భారత జోడీకి ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకం ఖాయమవుతుంది. అంతేకాకుండా చైనాపై ఉన్న ఓటముల పరంపరకు కూడా తెరపడుతుంది.
మహిళల డబుల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకం సాధించిన చివరి భారత జోడీ జ్వాలా గుత్తా–అశ్విని పొన్నప్ప. వారు 2011లో ఈ ఘనత సాధించారు. గాయత్రి–ట్రీసా క్వార్టర్ ఫైనల్ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారత మహిళల డబుల్స్ జోడీగా చరిత్ర సృష్టిస్తారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా.. క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా–గాయత్రి
11
Published: 📅
Reported by: 🖊
Kanakadri