టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తనకు గుర్తింపుగా మారిన 45 నంబర్ జెర్సీ వెనుక ఉన్న ఆసక్తికర కథను వెల్లడించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ నంబర్ ఎంపికలో తన తల్లి సూచన కీలక పాత్ర పోషించిందని తెలిపాడు.
తనకు మొదట సింగిల్ డిజిట్ నంబర్లు ఇష్టమని రోహిత్ చెప్పాడు. అయితే 5, 8, 9 వంటి నంబర్లు అప్పటికే ఇతర ఆటగాళ్లు తీసుకోవడంతో 19 నంబర్‌ను ఎంచుకున్నానని తెలిపాడు. అండర్-19 క్రికెట్లో కూడా అదే నంబర్‌తో ఆడానని గుర్తుచేశాడు.
తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యే సమయంలో 19 నంబర్‌ను కొనసాగించాలనుకున్నప్పటికీ, అది అప్పటికే రాహుల్ ద్రవిడ్ ఉపయోగిస్తున్న జెర్సీ నంబర్ అని ఓ సహచరుడు చెప్పాడని రోహిత్ వివరించాడు. దీంతో తనకు ఇష్టమైన 19ను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
ఆ సమయంలో తల్లికి ఫోన్ చేసి ఏ నంబర్ తీసుకోవాలో అడిగానని రోహిత్ చెప్పాడు. ఆమె 9 నంబర్ సూచించిందని, కానీ అది కూడా అందుబాటులో లేకపోవడంతో 4, 5 నంబర్లను కలిపి 45ను ఎంచుకున్నానని వెల్లడించాడు. 4+5 కలిపితే 9 అవుతుందని, జెర్సీపై కూడా 45 చూడటానికి బాగుంటుందని భావించానని చెప్పాడు. అప్పటి నుంచి 45 నంబర్ రోహిత్ శర్మకు ప్రత్యేక గుర్తింపుగా మారింది.
అమ్మ సూచనతోనే 45 నంబర్ జెర్సీ.. అసలు కథ చెప్పిన రోహిత్ శర్మ
16