రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట పరిధిలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న వీకెండ్ పార్టీపైన ఎస్వోటీ, చేవెళ్ల పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో మొత్తం 108 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో 37 మంది యువతులు ఉన్నారు.
విద్యార్థులందరికీ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, నలుగురికి గంజాయి వినియోగం పాజిటివ్‌గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థులంతా శంకర్పల్లి పరిధిలోని ఇక్ఫాయ్ వర్సిటీకి చెందిన బీబీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించినట్లు కథనం పేర్కొంది.
ఘటనాస్థలం నుంచి 15 గ్రాముల గంజాయి, పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు, ఏడు కార్లు, మూడు బైక్‌లు, 70 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహణకు మన్నన్ అనే వ్యక్తి విద్యార్థుల నుంచి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పార్టీ జరుగుతున్న సమాచారం అందడంతో పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేయగా, కొందరు విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీసినట్లు చెప్పారు. అనంతరం వారందరినీ ఒకచోట చేర్చి పరీక్షలు నిర్వహించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పార్టీకి గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పార్టీ నిర్వహించిన మన్నన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
చేవెళ్ల ఫామ్‌హౌస్ పార్టీలో గంజాయి.. 108 మంది విద్యార్థుల్లో నలుగురికి పాజిటివ్
18
Published: 📅
Reported by: 🖊
Sarika Sk