బ్రెయిన్ స్ట్రోక్ ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయినా, మెదడులో రక్తస్రావం జరిగినా స్ట్రోక్ సంభవిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే శాశ్వత పక్షవాతం లేదా ప్రాణాపాయం ఏర్పడవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం, మాట తడబడటం, చూపులో మార్పులు రావడం స్ట్రోక్ ప్రధాన లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సాధారణ నీరసంగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. రాత్రి సమయంలో వచ్చినా ఉదయం వరకు వేచి చూడకుండా వెంటనే అత్యవసర వైద్యసేవలు పొందాలి.
స్ట్రోక్ చికిత్సలో ప్రతి నిమిషం కీలకం. రక్తనాళంలో గడ్డ ఏర్పడటం వల్ల వచ్చే ఇస్కీమిక్ స్ట్రోక్‌కు అర్హులైన రోగుల్లో రక్తం గడ్డను కరిగించే మందులు ఉపయోగిస్తారు. కొందరికి ప్రత్యేక పద్ధతిలో రక్తనాళంలోని గడ్డను తొలగిస్తారు. బ్రెయిన్ స్కాన్, లక్షణాలు ప్రారంభమైన సమయం, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు చికిత్స నిర్ణయిస్తారు.
అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం, గుండె సంబంధిత సమస్యలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిని నియంత్రించడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
స్ట్రోక్ నుంచి కోలుకునేందుకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఉపయోగపడతాయి. వీటి ద్వారా రోగుల కదలికలు, మాట, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యం మెరుగుపడవచ్చు.
స్ట్రోక్ లక్షణాలను ఇతర అనారోగ్య సమస్యలుగా భావించి ఇంట్లో ఉండిపోవద్దని న్యూరాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కామిన్వార్ సూచించారు. త్వరగా ఆసుపత్రికి చేరుకోవడం ద్వారా మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. లక్షణాలు కొద్దిసేపటికే తగ్గిపోయినా నిర్లక్ష్యం చేయకుండా అత్యవసర వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన చికిత్సతో స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. స్ట్రోక్‌పై అవగాహనే ప్రాణాలను కాపాడే ముఖ్యమైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్‌లో ప్రతీ క్షణం కీలకం.. లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
16
Published: 📅
Reported by: 🖊
Banu Prakash