టాలీవుడ్‌లో సినిమా అవకాశాల పేరుతో యువ నటిని వేధించారనే ఆరోపణలపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆమెకు ప్రసాద్ పరిచయమయ్యాడు. ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని నమ్మించాడని ఆమె పేర్కొంది. అతని మాటలను నమ్మి 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన షూటింగ్ షెడ్యూల్స్‌లో పాల్గొన్నట్లు తెలిపింది.
షూటింగ్ పూర్తైన తర్వాత తనకు ఇవ్వాల్సిన రూ.90 వేల పారితోషికం, ప్రయాణ ఖర్చుల కింద రావాల్సిన మరో రూ.38 వేలు కలిపి మొత్తం రూ.1.28 లక్షలు ఇవ్వలేదని బాధితురాలు ఆరోపించింది. బకాయిల కోసం పలుమార్లు అడిగినా ప్రసాద్ నెలల తరబడి తిప్పించాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బకాయిల గురించి మాట్లాడుకుందామని బంజారాహిల్స్‌లోని ఒక నిర్మాత కార్యాలయం వద్దకు రావాలని ప్రసాద్ పిలిచినట్లు ఆమె తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా బెదిరించాడని, అనంతరం తనను బలవంతంగా కారులోకి ఎక్కించి కొంతదూరం తీసుకెళ్లాడని బాధితురాలు ఆరోపించింది. ఇండస్ట్రీలో పెద్ద అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది.
జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పగా, ఆమె ప్రసాద్‌ను ఫోన్‌లో నిలదీసినట్లు సమాచారం. ఆ సమయంలోనూ అతను నిర్లక్ష్యంగా స్పందించాడని, సినీ పరిశ్రమలో ఇలాగే ఉంటుందని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం బాధితురాలు, ఆమె తల్లి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసులో ఆరోపణల నిజానిజాలు, బకాయిల వివరాలు, ఫోన్ సంభాషణలు, ఘటన జరిగినట్లు చెప్పిన ప్రదేశాలపై పోలీసులు పరిశీలన చేపట్టారు.
సినిమా అవకాశాల పేరుతో నటికి వేధింపుల ఆరోపణలపై కేసు
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan