శ్రీవారి దర్శనం కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. ఆమె నడక యాత్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనకు విస్తృత గుర్తింపు లభించింది.
మొదట ఆమె కర్ణాటకకు చెందినవారని ప్రచారం జరిగినప్పటికీ, తితిదే విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ఆమె తమిళనాడుకు చెందిన నవనీతమ్మ అని గుర్తించారు. ప్రస్తుతం ఆమె తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో బంధువుల వద్ద ఉంటున్నట్లు నిర్ధారించారు.
ఈ సమాచారం అందిన వెంటనే తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నవనీతమ్మతో పాటు కుటుంబ సభ్యులను కూడా వీఐపీ బ్రేక్ దర్శనానికి తీసుకెళ్లారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర నవనీతమ్మకు పట్టువస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అత్యంత వృద్ధాప్యంలోనూ శ్రీవారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న నవనీతమ్మ భక్తి పలువురిని కదిలించింది. ఈ సందర్భంగా తితిదే చూపిన గౌరవం కూడా భక్తుల ప్రశంసలు అందుకుంటోంది.
116 ఏళ్ల నవనీతమ్మకు శ్రీవారి వీఐపీ దర్శనం.. తితిదే ప్రత్యేక సన్మానం
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan