భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ రాంచీలో జరగనున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు జేఎస్‌సీఏ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నెట్స్‌లో బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ భారీ షాట్లు ఆడిన వైభవ్ వరుస బౌండరీలతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
అతడి బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు పోలీసులు, ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో నెట్స్ సమీపంలో గుమిగూడారు. సీనియర్ ఆటగాళ్లకు ప్రాధాన్యం లభించడంతో ఇప్పటివరకు జట్టులో అవకాశం రాక బెంచ్‌కే పరిమితమైన వైభవ్‌కు రెండో టీ20లో తుది జట్టులో చోటు కల్పిస్తారా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.
ఇదే ప్రాక్టీస్ సెషన్‌లో ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. రాంచీ తనకు సొంత మైదానం లాంటిదే కావడంతో అతడు మరింత ఆత్మవిశ్వాసంగా కనిపించాడు. రవి బిష్ణోయ్, నమన్ ధీర్, అభిషేక్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాడు. సంజు శాంసన్‌తో కలిసి బ్యాటింగ్ సాధన చేస్తూ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్నాడు.
గతంలో దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ చూపిన ప్రదర్శన కూడా అతడికి అదనపు బలం. దీంతో రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఉంటాయా, యువ వైభవ్‌కు అవకాశం వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
నెట్స్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. రెండో టీ20లో అవకాశం దక్కుతుందా?
9