హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్ సెక్స్టార్షన్ మోసానికి గురై సుమారు రూ.20 లక్షలు కోల్పోయారు. ఈసీఐఎల్‌లో పనిచేసి పదవీ విరమణ చేసిన 66 ఏళ్ల వ్యక్తికి అక్టోబర్ 5న ఫేస్‌బుక్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి న్యూడ్ వీడియో కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు కాల్‌కు స్పందించగా, మోసగాళ్లు దాన్ని రికార్డు చేశారు.
అనంతరం ఆ వీడియోను యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేస్తామని బెదిరించారు. ఇప్పటికే వీడియోను పోస్ట్ చేశామని, దాన్ని తొలగించాలంటే రూ.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
భయాందోళనకు గురైన బాధితుడు పలు విడతల్లో సుమారు రూ.18 లక్షలు పంపించారు. ఆ తర్వాత మరో రూ.2 లక్షలు బదిలీ చేశారు. వరుసగా భారీ మొత్తాల్లో డబ్బు బదిలీ అవుతుండటాన్ని గమనించిన బ్యాంకు అధికారులు కారణం ఆరా తీశారు. విషయం తెలుసుకున్న వారు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే బ్యాంకుకు చేరుకుని బాధితుడి ఖాతాలో ఉన్న సుమారు రూ.80 లక్షల నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు మోసగాళ్లకు బదిలీ కాకుండా చర్యలు తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి బెదిరింపులకు గురైతే డబ్బు పంపకుండా వెంటనే బ్యాంకు, సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించడం కీలకమని పోలీసులు సూచిస్తున్నారు.
న్యూడ్ వీడియో కాల్‌తో బెదిరింపులు.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.20 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
1