rakshitha back in spotlight amid kd the devil song controversy

‘కేడీ’ వివాదంతో మళ్లీ ఫోకస్‌లో రక్షిత.. హీరోయిన్ నుంచి నిర్మాతగా ప్రయాణం

18

Published on: 📅 19 Mar 2026, 01:18 PM
Reporter: 🖊 Suresh Reddy

‘కేడీ: ది డెవిల్’ చిత్రంలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదం కారణంగా నటి రక్షిత మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ భార్య అయిన రక్షిత, ఒకప్పుడు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె నిర్మాతగా కొనసాగుతున్నారు.

బెంగళూరుకు చెందిన రక్షిత అసలు పేరు శ్వేత. సినీ నేపథ్య కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.సి. గౌరీశంకర్, తల్లి నటి మమతా రావు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి కలిగిన రక్షిత, కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘అప్పూ’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టారు.

ఈ సినిమా తెలుగులో ‘ఇడియట్’గా రీమేక్ కాగా, రవితేజ సరసన నటించిన రక్షిత టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె వరుస అవకాశాలను అందుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివమణి’, ‘ఆంధ్రావాలా’ వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు.

మహేశ్‌బాబు నటించిన ‘నిజం’ చిత్రంలో ఆమె పోషించిన జానకి పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. అలాగే చిరంజీవి ‘అందరివాడు’లో కూడా ఆమె నటన ఆకట్టుకుంది. తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం ఆమెకు దక్కడం విశేషం.

తెలుగులో చివరిగా ‘జగపతి’ చిత్రంలో నటించిన తర్వాత, ఆమె కన్నడ చిత్రాలకు మాత్రమే పరిమితమయ్యారు. 2007లో దర్శకుడు ప్రేమ్‌ను వివాహం చేసుకున్న అనంతరం నటనకు దూరమయ్యారు. అయితే సినీ రంగంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా మారారు.

ప్రేమ్ దర్శకత్వంలో వచ్చిన ‘జోగయ్య’, ‘ఏక్ లవ్ యా’ చిత్రాలను నిర్మించిన రక్షిత, ఇతర దర్శకుల సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. కొంతకాలం తర్వాత ‘ఏక్ లవ్ యా’లో అతిథి పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

అలాగే టెలివిజన్ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా, హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ‘ది విలన్’ సినిమాలో అమీ జాక్సన్ పాత్రకు స్వరం అందించారు.

ఇటీవల ఆమె లుక్ మార్పుతో కూడా వార్తల్లో నిలిచిన రక్షిత, ఇప్పుడు ‘కేడీ’ పాట వివాదంతో మరోసారి చర్చకు కేంద్రంగా మారారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె, ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతూ సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపును నిలుపుకుంటున్నారు.

Sponsored