భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆసియా మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లలో డబుల్ గోల్డ్ సాధించింది. హాంకాంగ్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో రెండు విభాగాల్లోనూ స్థిరమైన ప్రదర్శన కనబరిచి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.
ర్యాపిడ్ విభాగాన్ని 11 రౌండ్ల స్విస్ పద్ధతిలో నిర్వహించారు. ఒక్కో గేమ్‌కు 15 నిమిషాలతోపాటు ప్రతి ఎత్తుకు పది సెకన్ల అదనపు సమయం ఇచ్చారు. హారిక 11 రౌండ్లలో 8.5 పాయింట్లు సాధించి మహిళల టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ పోటీలు జూలై 28, 29 తేదీల్లో హాంకాంగ్‌లోని టుంగ్‌పో కిట్టీ వూ స్టేడియంలో జరిగాయి.
ర్యాపిడ్ విజయం తర్వాత బ్లిట్జ్ విభాగంలోనూ హారిక తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మూడు నిమిషాలు, ప్రతి ఎత్తుకు రెండు సెకన్ల ఇంక్రిమెంట్‌తో జరిగిన 13 రౌండ్ల పోటీలో 10.5 పాయింట్లు సాధించింది.
తొమ్మిది విజయాలు నమోదు చేసిన హారిక ఒకే ఒక్క పరాజయాన్ని ఎదుర్కొంది. రష్యాకు చెందిన వాలెంటినా గునినా 10 పాయింట్లతో రజతం సాధించగా, ఉజ్బెకిస్థాన్ క్రీడాకారిణి ఉమిదా ఒమోనోవా 9.5 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. హారిక అర పాయింటు స్పష్టమైన ఆధిక్యంతో టైటిల్‌ను ఖాయం చేసుకుంది.
పురుషుల ఓపెన్ విభాగంలో కేరళకు చెందిన యువ ఇంటర్నేషనల్ మాస్టర్ గౌతమ్ కృష్ణ రెండు రజత పతకాలతో సత్తా చాటాడు. ర్యాపిడ్‌లో రష్యాకు చెందిన అలెక్సీ గ్రెబ్నెవ్, గౌతమ్, ఇలియా ఇల్యూషెనోక్ తలా 8.5 పాయింట్లు సాధించారు. మెరుగైన టైబ్రేక్‌తో గ్రెబ్నెవ్ విజేతగా నిలవగా, గౌతమ్‌కు రెండో స్థానం దక్కింది.
బ్లిట్జ్‌లో గౌతమ్ 13 రౌండ్లకు 11 పాయింట్లు సాధించాడు. వియత్నాంకు చెందిన లే తువాన్ మిన్ కూడా 11 పాయింట్లతో ముగించినప్పటికీ, టైబ్రేక్‌లో మొదటి స్థానం దక్కించుకున్నాడు. గౌతమ్ రెండో స్థానంలో నిలిచి వరుసగా రెండో రజతాన్ని అందుకున్నాడు. గౌతమ్ 12 గేముల్లో 11 విజయాలు సాధించడం అతడి ప్రదర్శనలో ప్రధాన విశేషం.
ఆసియా చెస్‌లో హారిక డబుల్ గోల్డ్.. ర్యాపిడ్, బ్లిట్జ్ టైటిళ్లు కైవసం
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan