గోదావరి నదిలో పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీవో స్వాతి తెలిపారు. బోట్ల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే మళ్లీ అనుమతులు ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఓ పర్యాటక బోటు పాపికొండల విహారయాత్రకు బయలుదేరింది. ఆ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చేరుకునే సరికి బోటులో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్రమత్తమైన సరంగు బోటును నిలిపివేయడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో అధికారులు భద్రతా అంశాలను తీవ్రంగా పరిగణించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు గోదావరిలో నడుస్తున్న పర్యాటక బోట్లపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. బోట్ల ఫిట్‌నెస్, ఇంజిన్ పరిస్థితి, ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు, లైఫ్ జాకెట్లు, అనుమతులు, నిర్వాహకుల నిబంధనల పాటింపు వంటి అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. తనిఖీల నివేదిక వచ్చిన తర్వాతే బోట్ల రాకపోకలకు అనుమతులు ఇవ్వనున్నట్లు ఆర్డీవో తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించని బోట్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
పాపికొండలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉంది. గోదావరి నదిలో బోటు ప్రయాణం ఈ విహారయాత్రలో ప్రధాన ఆకర్షణ. అయితే ప్రయాణికుల సంఖ్య, నది ప్రవాహం, బోట్ల సాంకేతిక పరిస్థితి, వాతావరణ మార్పులు వంటి అంశాలు భద్రతా పరంగా కీలకంగా మారతాయి. అందుకే అధికారులు ఈసారి ముందుగానే తనిఖీలకు ప్రాధాన్యం ఇచ్చారు. పర్యాటక సీజన్‌లో బోట్ల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో, ప్రతి బోటు నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించాల్సిన అవసరం ఉంది.
సాంకేతిక లోపం తర్వాత పాపికొండల బోట్లపై తనిఖీలు
11
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan