తిరుపతి జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన రైతులుతిరుపతి జిల్లాలో ఓ ఒంటరి మదపుటేనుగు బీభత్సం సృష్టించింది. రెండు మండలాల పరిధిలోని మూడు గ్రామాల రైతులను రాత్రంతా భయాందోళనకు గురిచేసింది. పంట పొలాలను ధ్వంసం చేయడంతో పాటు తనను తరిమేందుకు ప్రయత్నించిన రైతులపైకి దూసుకెళ్లింది. అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాల సాయంతో ఏనుగు కదలికలను గుర్తించి రైతులను అప్రమత్తం చేశారు.
చిన్నగొట్టిగల్లు మండలం తుమ్మసేనుపల్లెకు చెందిన సిద్ధమ్మ వరి పంటను ఏనుగు ధ్వంసం చేసింది. దేవరకొండ గ్రామానికి చెందిన రామయ్య వరి పొలంతో పాటు సమీపంలోని వేరుశనగ పంటను కూడా నాశనం చేసింది. దీంతో వంగుమళ్లవారిపల్లెకు చెందిన సుమారు 50 మంది రైతులు ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అయితే టార్చిలైట్ల వెలుతురులో ఏనుగు వారిపైకి దూసుకురావడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు.
అనంతరం ఏనుగు గ్రామంలోకి ప్రవేశించడంతో రైతులు ట్రాక్టర్ల శబ్దాలతో దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి మల్లెలవాండ్లపల్లె వైపు వెళ్లిన ఏనుగు టపాసులు పేల్చినా వెనక్కి తగ్గకుండా రైతులను వెంబడించింది. ఈ క్రమంలో పలువురు రైతులు కిందపడి స్వల్పంగా గాయపడ్డారు.
అటవీశాఖ అధికారి నిఖిల్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్ కెమెరాలతో ఏనుగు కదలికలను పర్యవేక్షించారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఏనుగును ఎర్రావారిపాలెం మండలం పచ్చారవాండ్లపల్లె సమీపానికి మళ్లించారు.
ఈ క్రమంలో ఇమాం హుసేన్, నాగభూషణకు చెందిన పొలాల వద్ద గుడిసెలను ఏనుగు కూల్చివేసింది. చివరకు చింతగుంట పంచాయతీ సమీపంలోని ఎలిఫెంట్ కారిడార్ ప్రాంతానికి చేరుకుంది. గతంలో 11 ఏనుగులు వెళ్లిన మార్గంలోనే ఈ ఏనుగు తిష్ఠవేసినట్లు సమాచారం. రాత్రంతా కొనసాగిన ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పంట నష్టంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు మళ్లీ గ్రామాల వైపు వస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని రైతులు భావిస్తున్నారు.
తిరుపతి జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం.. రాత్రంతా రైతుల పరుగులు
12
Published: 📅
Reported by: 🖊
Sarika Sk