తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో అరుదైన ఆధ్యాత్మిక వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 60 ఏళ్ల అనంతరం స్వామివారి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం సిద్ధమవుతోంది. నవంబర్ 16 నుంచి 20 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు రెండు ముఖాలతో భక్తులకు దర్శనమిస్తారు. తూర్పు వైపు నరసింహస్వామిగా, ఉత్తరం వైపు ఆంజనేయస్వామిగా కొలువై ఉంటారు. ఈ ఆలయానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.
ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం స్వామివారి విగ్రహానికి సింధూర లేపనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మూలవిరాట్టుపై సుమారు ఆరు అంగుళాల మందంతో సింధూరం పేరుకుపోయింది. దీంతో భక్తులకు స్వామివారి అసలు రూపం దర్శనమివ్వడం లేదు.
ఈ నేపథ్యంలో నవంబర్ 16 నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్రతువుల ద్వారా విగ్రహంపై ఉన్న సింధూరాన్ని తొలగించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అర్చకులు పది రోజుల ముందుగానే దీక్షలు స్వీకరించనున్నారు.
రావి, జువ్వి, మర్రి, మేడి, దరిమి చెట్ల కలపను ఉపయోగించి సంప్రదాయ పద్ధతిలో సింధూరాన్ని తొలగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు పీఠాధిపతులు హాజరుకానున్నారు. యాగశాలలో 50 మంది రుత్వికులతో ప్రత్యేక త్రికుండాత్మక యజ్ఞం నిర్వహించనున్నారు.
అలాగే ఆలయ రాజగోపురంపై సుదర్శన చక్రం, సింధూరం తొలగించే నవంబర్ 16 నుంచి 20 వరకు మూలవిరాట్టు దర్శనాన్ని నిలిపివేస్తారు.
అయితే ఈ ఐదు రోజుల్లో భక్తులు ఆలయంలోని ప్రత్యేక కర్ర ఉత్సవమూర్తితో పాటు వేంకటేశ్వరస్వామి, మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవచ్చు. నవంబర్ 21 నుంచి 41 రోజులపాటు భక్తులకు ఆంజనేయస్వామి నిజరూప దర్శనం కల్పించనున్నారు.
ఈ చందనోత్సవ నిర్వహణ కోసం దేవస్థానం రూ.20 లక్షలు కేటాయించినట్లు ఈవో అంజనారెడ్డి వెల్లడించారు. నిజరూప దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముండటంతో ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.
60 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అరుదైన వేడుకను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
60 ఏళ్ల తర్వాత కొండగట్టు అంజన్న చందనోత్సవం.. నవంబర్ 16 నుంచి ప్రత్యేక పూజలు, 21 నుంచి నిజరూప దర్శనం!
7
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk