పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో దేశంలో ఇంధనంపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఝార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన మరింత కలకలం రేపింది. పలాము జిల్లాలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించగా, అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన ఎల్పీజీ సిలిండర్ల కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా, భవనం బేస్‌మెంట్‌లో మొత్తం 61 సిలిండర్లు నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
ఈ సిలిండర్లలో ఒకటి పేలిపోవడంతో అగ్నిప్రమాదం చెలరేగింది. పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు వివరాలు నమోదు చేసి, ఇద్దరు సిబ్బందిని అక్కడే పర్యవేక్షణ కోసం ఉంచారు. అయితే పేలుడు తీవ్రత కారణంగా భవనం వెనుక గోడ కూలిపోవడం అనుకోని పరిణామాలకు దారి తీసింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న దుండగులు ఆ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించి 43 ఎల్పీజీ సిలిండర్లను అపహరించారు.
అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఈ ఘటనను గమనించకపోవడం పెద్ద వివాదానికి దారి తీసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ దొంగతనం జరిగిందని అధికారులు నిర్ధారించారు. దీంతో జార్ఖండ్ పోలీసులుకు చెందిన మొత్తం తొమ్మిది మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఎస్‌డీపీఓ రాజీవ్ రంజన్ తెలిపారు.
ఇక భవన యజమాని అజయ్ సాహు అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన భద్రతా లోపాలను బయటపెట్టడమే కాకుండా, ఇంధన కొరత భయాల మధ్య నల్లబజార్ కార్యకలాపాలపై కూడా సందేహాలు రేకెత్తిస్తోంది.
అగ్నిప్రమాదం మధ్య సిలిండర్ దొంగతనం.. 9 పోలీసుల సస్పెన్షన్
10
Published: 📅
Reported by: 🖊
Suresh Reddy