భూటాన్లోని వాయవ్య ప్రాంతం గాసా జిల్లాలో ఉన్న షింటాఫు సరస్సు వద్ద హిమానీనదం బద్దలవడంతో ఆకస్మిక వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం సాయంత్రం జరిగిన ఈ పరిణామంతో సరస్సు నుంచి భారీగా నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహించినట్లు అధికారులు తెలిపారు.
వరద ప్రవాహంతో గాసా త్షాచు ప్రాంతంలోని కొన్ని సౌకర్యాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. అయితే ప్రమాద సూచనలు ముందుగానే అందడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో ప్రాణనష్టం జరగలేదని భూటాన్ అధికారులు వెల్లడించారు. రహదారులు, వంతెనలకు కూడా నష్టం జరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
భూటాన్ నుంచి దిగువకు ప్రవహించే నీరు భారత్లోని నదీ వ్యవస్థల్లోకి చేరే అవకాశం ఉండటంతో పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సంకోష్ నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్, కూచ్బెహార్ ప్రాంతాలతో పాటు ఉత్తర బెంగాల్లోని మరికొన్ని ప్రాంతాలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. అసోంలోని ధుబ్రి జిల్లాలో కూడా వరద హెచ్చరికలు అమల్లోకి వచ్చాయి.
నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భూటాన్లోని పరిస్థితులను భారత అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ, దిగువ ప్రాంతాల్లో నీటి మట్టాల మార్పులను గమనిస్తున్నారు.
భూటాన్లో హిమానీనద విరుగు.. బెంగాల్, అసోంకు ఆకస్మిక వరద ముప్పు
15
Published: 📅
Reported by: 🖊
Kanakadri