ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ రంగాన్ని మరింత విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అదానీ ఇన్ఫ్రా అనుబంధ సంస్థలు ప్రతిపాదించిన విశాఖ హైపర్‌స్కేల్, మెగా, రాంబిల్లి డేటా సెంటర్ పార్కులకు సంబంధించిన సవరించిన నిబంధనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించిన విక్రయ ఒప్పందాల్లో మార్పులకు కూడా SIPB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రాజెక్టులకు అవసరమైన విదేశీ వాణిజ్య రుణాలు (ECBs) పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
భూ కేటాయింపులకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. భూ కేటాయింపు రద్దు నోటీసులు జారీ చేసే ముందు సంబంధిత సంస్థలకు 30 రోజుల క్యూర్ పీరియడ్ ఇచ్చేలా ఒప్పంద నిబంధనలను సవరించింది.
అదేవిధంగా, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5.84 ఎకరాల భూమిని అదానీ సంస్థకు లీజుకు కేటాయించాలని నిర్ణయించారు. దేవాదాయ శాఖ భూములకు వర్తించే లీజు విధానం ప్రకారం, ఎస్‌ఆర్‌ఓ విలువలో 3 శాతం చొప్పున లీజు రేటును నిర్ణయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
డేటా సెంటర్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి పన్ను ఆదాయం పెరగడమే కాకుండా అనుబంధ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థలు, సరఫరాదారులు ఏపీలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా డేటా సెంటర్ల ద్వారా వచ్చే జీఎస్టీ ఆదాయం రాష్ట్రానికే వచ్చేలా చర్యలు తీసుకుంటోంది.
ఏపీలో డేటా సెంటర్లకు గ్రీన్ సిగ్నల్.. అదానీ ప్రతిపాదనలకు SIPB ఆమోదం
9
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk