ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరగడంతో ఇద్దరు భారతీయ నావికులు గల్లంతైనట్లు కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. అక్టోబర్ 11న ఒమన్ ఉత్తర ప్రాంతంలోని సోహార్ నౌకాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.
నికరాగ్వా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ అనే చమురు రవాణా నౌకలో దాడి సమయంలో మొత్తం 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. డ్రోన్ దాడి అనంతరం చేపట్టిన అత్యవసర సహాయక చర్యల్లో తొమ్మిది మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. అయితే మరో ఇద్దరు నావికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని మంత్రి తెలిపారు.
గల్లంతైన వారిని గుర్తించేందుకు ఒమన్‌కు చెందిన స్థానిక తీర రక్షక దళం గాలింపు చర్యలు చేపట్టింది. భారత అధికారులు కూడా ఒమన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు.
మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఘటనపై స్పందించింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం సంబంధిత అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపింది.
ఈ ఘటన నేపథ్యంలో సముద్ర మార్గాల్లో భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైన ఇద్దరు భారతీయ నావికుల కోసం అన్వేషణ కొనసాగుతుండగా, దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
ఒమన్ సమీపంలో చమురు నౌకపై డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయ నావికులు గల్లంతు
7
Published: 📅
Reported by: 🖊
Kanakadri