రంగారెడ్డి జిల్లాలో సెల్‌ఫోన్ కోసం ఓ యువకుడిపై కత్తితో దాడి చేసి ఫోన్ దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆరంగర్‌లోని ఎంఎస్ కాలేజీ సమీప రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న యువకుడిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు, అతని వద్దకు వెళ్లి సెల్‌ఫోన్ ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. అయితే బాధితుడు ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో దుండగుడు అతడిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి భుజం, పొట్ట భాగాల్లో కత్తితో పొడిచి, అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించారు. కిషన్‌బాగ్‌కు చెందిన 25 ఏళ్ల సయ్యద్ జహీర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడి వద్ద నుంచి దోపిడీకి గురైన సెల్‌ఫోన్‌తో పాటు ద్విచక్రవాహనం, దాడికి ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.
సెల్‌ఫోన్ కోసం యువకుడిపై కత్తితో దాడి.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
2