హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్, తక్కువ ధరలకు ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయం పేరుతో జరిగిన మూడు సైబర్ మోసం కేసుల్లో బాధితులు రూ.3 కోట్లకు పైగా నష్టపోయారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు అందిన ఫిర్యాదుల ప్రకారం, రెండు ట్రేడింగ్ మోసాల్లోనే సుమారు రూ.2.97 కోట్లకు పైగా నష్టం జరిగింది.
దుండిగల్‌కు చెందిన 57 ఏళ్ల వ్యక్తిని అప్‌స్టాక్స్ ప్రతినిధులమని చెప్పిన వ్యక్తులు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. ‘ఉట్రేడ్ డీఎంఏ’ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించి, వివిధ బ్యాంకు ఖాతాలకు ఏడు లావాదేవీల్లో రూ.11.31 లక్షలు బదిలీ చేయించారు. యాప్‌లో సుమారు రూ.36 లక్షల లాభం వచ్చినట్లు చూపించి, విత్‌డ్రా కోసం మరో రూ.25.90 లక్షలు అడిగినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
మరో ఘటనలో మణికొండకు చెందిన 62 ఏళ్ల మహిళను నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్ ద్వారా పెట్టుబడులకు ప్రోత్సహించారు. జూలై 27 నుంచి అక్టోబర్ 7 వరకు 16 లావాదేవీల్లో ఆమె రూ.2.85 కోట్లు బదిలీ చేసింది. రూ.4.14 కోట్ల లాభం వచ్చినట్లు చూపించి, డబ్బు తీసుకోవాలంటే మరో రూ.80 లక్షలు చెల్లించాలని కోరడంతో ఆమె మోసాన్ని గుర్తించింది.
కొండాపూర్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడు OLXలో ల్యాప్‌టాప్, ఫర్నిచర్ కొనుగోలు ప్రయత్నంలో రూ.4.38 లక్షలు కోల్పోయాడు. వస్తువులు పంపిస్తామని చెప్పి పలుమార్లు డబ్బు బదిలీ చేయించుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మూడు కేసులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మూడు కేసుల్లో రూ.3 కోట్లకు పైగా మోసం.. ఆన్‌లైన్ ట్రేడింగ్, OLX పేరుతో భారీ నష్టం
8