జపాన్‌లో మరోసారి భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఆదివారం తెల్లవారుజామున టోక్యోతో పాటు తూర్పు జపాన్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంపం తీవ్రత 5.9గా నమోదైంది. దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భూకంపం కారణంగా టోక్యో సహా తూర్పు జపాన్‌లోని పలు ప్రాంతాల్లో భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ), అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) కూడా భూకంప తీవ్రతను 5.8గా నమోదు చేశాయి. భూకంప కేంద్రం హోన్షు తూర్పు తీరానికి సమీపంలో సుమారు 78 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి.
ప్రకంపనల ప్రభావంతో ఇబరాకి, చిబా, సైతామా ప్రిఫెక్చర్‌లలో పలువురు గాయపడినట్లు జపాన్ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టోక్యో, నరిటా విమానాశ్రయాల వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే కొన్ని లోకల్ రైళ్ల సర్వీసులు ఆలస్యమయ్యాయి.
అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికను అధికారులు జారీ చేయలేదు. పరిస్థితిని సమీక్షించేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
జపాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుండటంతో తాజా ప్రకంపనల తర్వాత అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
జపాన్‌లో మరోసారి భూకంపం.. టోక్యో సహా తూర్పు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు
6
Published: 📅
Reported by: 🖊
Kanakadri