యూకేలోని బర్మింగ్హామ్ సమీపంలోని సోలిహల్ ప్రాంతంలో ముగ్గురు భారతీయ విద్యార్థులను పార్కు నుంచి వెళ్లిపోవాలని కొందరు యువకులు హెచ్చరించిన ఘటన చర్చనీయాంశమైంది. మెరిడెన్ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, తమను ‘చెల్మ్స్లీ వుడ్ పాట్రియట్స్’గా పిలుచుకునే బృందానికి చెందిన వ్యక్తులు భారతీయ విద్యార్థులను అడ్డుకుని వారు ఇంగ్లండ్కు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మాస్టర్స్ చదివేందుకు వచ్చామని, బర్మింగ్హామ్లో నివసిస్తున్నామని విద్యార్థులు సమాధానమిచ్చారు. అనంతరం మళ్లీ ఆ పార్కుకు రావద్దని వారిని హెచ్చరించినట్లు వీడియోలో కనిపించిందని కథనం పేర్కొంది.
ఆ బృందం తాము రాత్రివేళ పార్కులో మహిళలు, చిన్నారుల భద్రత కోసం గస్తీ నిర్వహిస్తున్నామని చెప్పుకుంది. విద్యార్థులను అక్కడి నుంచి పంపించిన వీడియోను వారి సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసి తరువాత తొలగించినట్లు సమాచారం. అయితే విద్యార్థులను వారి జాతి నేపథ్యం కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
స్థానిక మాజీ కౌన్సిలర్ శేష్ శేషభట్టర్ స్పందిస్తూ విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం వాకింగ్ కోసం పార్కుకు వెళ్లారని తెలిపారు. ఘటన తమ దృష్టికి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. వివరాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నందున పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
మళ్లీ ఈ పార్కుకు రావొద్దు.. యూకేలో భారతీయ విద్యార్థులకు హెచ్చరిక
4
Published: 📅
Reported by: 🖊
Sarika Sk