విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు సందర్భంగా బుధవారం అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు.
‘జై దుర్గా.. జై జై దుర్గా’ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రత వంటి అంశాల్లో అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నారు.
పండితుల ప్రకారం మహాచండీ దేవి మహాలక్ష్మి, మహాకాళీ, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా భావించబడుతుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ, దేవతల కార్యసిద్ధి కోసం మహాచండీ అవతరించిందని ఆధ్యాత్మిక విశ్వాసం. ఈ రూపాన్ని భక్తితో పూజిస్తే విద్య, కీర్తి, సంపదలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా శ్రీ మహాచండీ అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది.
శ్రీ మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
2
Published: 📅
Reported by: 🖊
Kanakadri