బహ్రెయిన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రవాసులు దసరా, బతుకమ్మ పండుగలను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రంగురంగుల బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని ప్రతిష్ఠించి నవదుర్గల అలంకరణలతో దసరా పండుగ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించారు. ప్రవాస జీవనంలో నిత్యం బిజీగా ఉండే తెలుగు కుటుంబాలకు ఈ కార్యక్రమం ఒక సాంస్కృతిక కలయికగా మారింది.
ఈ ఉత్సవానికి బహ్రెయిన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భారత రాయబారి డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు కళా సమితి ఉపాధ్యక్షుడు వెంకట్ స్వామి, ప్రధాన కార్యదర్శి సతీష్ శెట్టి, కోశాధికారి అరుణ్ కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
విదేశీ గడ్డపై తెలుగు పండుగలను నిర్వహించడం ద్వారా భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కొత్త తరాలకు పరిచయం చేయవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సాంస్కృతిక ఐక్యతను పెంపొందించిన ఈ కార్యక్రమం ప్రశంసలు అందుకుంది.
బహ్రెయిన్‌లో ఘనంగా దసరా–బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు ప్రవాసులు
4