చైనా ఆధీనంలోని టిబెట్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం నాగ్‌కు నగర పరిధిలో గురువారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 10.33 గంటలకు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు చైనా భూకంప పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది.
చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందగా, మరో 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టిబెట్ రాజధాని లాసా నుంచి భూకంప ప్రభావిత ప్రాంతం దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.
భూకంపంతో నాగ్‌కు పరిసర ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కనీసం 339 ఇళ్లు, 20 పశువుల కొట్టాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడగా, భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
బాధితులను రక్షించేందుకు స్థానిక అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. 1,600 మందికి పైగా సిబ్బందిని రక్షణ, సహాయక కార్యక్రమాల్లో నియమించారు. నిరాశ్రయులైన వారికి తాత్కాలిక నివాసాలు, గుడారాలు, పడకలు, చలిని తట్టుకునే దుస్తులు అందిస్తున్నట్లు సమాచారం. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు
టిబెట్‌లో 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు
13
Published: 📅
Reported by: 🖊
Kanakadri