స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్ మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2028 అక్టోబర్ 23 నాటికి భారతీయులే రూపకల్పన చేసి, భారత్‌లోనే తయారు చేసి, భారతీయ బ్రాండ్ పేరుతో మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు.
ఢిల్లీలో జరిగిన వరల్డ్ సమ్మిట్‌లో మాట్లాడిన వైష్ణవ్, ప్రస్తుతం భారత్ మొబైల్ ఫోన్ తయారీలో గణనీయంగా ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. అయితే సొంత డిజైన్, సాంకేతిక పరిజ్ఞానం, బ్రాండ్ అభివృద్ధి, మేధో సంపత్తి హక్కుల విషయంలో ఇంకా బలమైన వ్యవస్థను నిర్మించాల్సి ఉందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఆపిల్, శామ్సంగ్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా నిలిచే భారతీయ బ్రాండ్‌ను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మొబైల్ రూపకల్పనలో యాంటెన్నా, రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థలు, ప్రాసెసర్, మెమరీ, కెమెరా, డిస్ప్లే, పవర్ మేనేజ్మెంట్ వంటి అనేక భాగాలను సమన్వయం చేయాల్సి ఉంటుందని వివరించారు.
మూడేళ్ల క్రితం భారతీయ డిజైనర్లకు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ తయారీ సవాల్ విసిరామని, రెండు సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. వాటిలో ఒక సంస్థ రూపొందించిన 5జీ ఫోన్ డిజైన్‌కు అమెరికాలో గుర్తింపు లభించినట్లు వెల్లడించారు.
మొబైల్ ఫోన్లతో పాటు డ్రోన్లు, రైళ్లు, క్షిపణులు, ఇతర ఆధునిక పరికరాల తయారీ కూడా భారత్‌లో విస్తరిస్తోందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ దేశ ఎగుమతుల్లో మూడో అతిపెద్ద విభాగంగా ఉందని, త్వరలో రెండో స్థానానికి చేరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2028 నాటికి భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
7
Published: 📅
Reported by: 🖊
Sarika Sk