నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెదర్లాండ్స్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కార్యదర్శి వెంకట్ కృష్ణ కోక, నవీన్ ఆచంట సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, ఒక జాతి అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేది మాతృభాషేనని అన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి గౌరవాన్ని, తెలుగు భాష ప్రాధాన్యతను ఎల్లప్పుడూ ముందుకు తెచ్చారని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవడం కేవలం భావోద్వేగం కాదు, భవిష్యత్ తరాలకు సాంస్కృతిక గుర్తింపును అందించే బాధ్యత అని అన్నారు.
యూరప్‌లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ పిల్లలకు తెలుగు నేర్పించేందుకు కృషి చేస్తున్నారని మన్నవ సుబ్బారావు తెలిపారు. అమెరికాలోని సిలికానాంధ్ర సహకారంతో మాతృభాషను భావితరాలకు అందిస్తూ, మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారని అభినందించారు.
నెదర్లాండ్స్‌లో మనబడి కార్యక్రమం ద్వారా 25 మంది వాలంటీర్లు వారానికి రెండు రోజులు, నాలుగు గంటల పాటు సుమారు 250 మంది విద్యార్థులకు తెలుగు బోధిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కృషి ఐరోపా ఖండంలో తెలుగు వెలుగులను విస్తరింపజేస్తోందని వక్తలు పేర్కొన్నారు.
సంపత్ ఐనంపూడి మాట్లాడుతూ, నెదర్లాండ్స్‌లో పెరుగుతున్న తెలుగు పిల్లలు తెలుగు భాషతో పాటు డచ్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ వంటి భాషలను కూడా అభ్యసిస్తున్నారని చెప్పారు. భౌగోళిక సరిహద్దులు భాషకు అడ్డంకులు కావని ఈ పిల్లలు నిరూపిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షులు వివేక్ కరియావుల, ఆచంట గోపాలరావు, సత్యనారాయణ సలకి, అమర్ చంద్ రావి, ప్రసాద్ రామినేని, పవన్ గుమ్మడి, ప్రవీణ్ ముమ్మినేని, చైతన్య వెల్లంకి, నవీన్ పరుచూరి, ఫణీష్ పోతురాజు, నంద ఉదయగిరి తదితరులు పాల్గొన్నారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఈ వేడుక ఎన్టీఆర్ జ్ఞాపకంతో పాటు తెలుగు భాష పరిరక్షణకు ప్రవాసుల కట్టుబాటును చూపించింది.
నెదర్లాండ్స్‌లో ఎన్టీఆర్‌కు ప్రవాస తెలుగువారి ఘన నివాళి
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan