నేటి జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంటసేపు తమ ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం కేటాయించాలని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సూచించాడు. ముఖ్యంగా జెన్ జీ, జెన్ ఆల్ఫా తరాలు తమ రోజువారీ అలవాట్లను మార్చుకుని శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నాడు.
గతంలో భారతీయుల ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ రోజువారీ జీవితంలో శారీరక శ్రమ కూడా అధికంగా ఉండేదని ధోని వివరించాడు. ప్రస్తుతం ఆటోలు, క్యాబ్‌లు, ఆఫీస్ ఉద్యోగాలు, గంటల తరబడి కూర్చునే అలవాట్ల కారణంగా శరీర కదలికలు తగ్గిపోయాయని చెప్పాడు. అయితే పాత ఆహారపు అలవాట్లు కొనసాగుతుండటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
ఫాస్ట్‌ఫుడ్, అధిక చక్కెర, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని ధోని సూచించాడు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కొద్దిమందికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలని చెప్పాడు.
పిల్లలను పాఠశాల స్థాయి నుంచే వివిధ క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ధోని సూచించాడు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఓటమిని స్వీకరించి మళ్లీ ప్రయత్నించే లక్షణాలను పెంపొందిస్తాయని వివరించాడు. చిన్న వయస్సులోనే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుంటే భవిష్యత్తులో కుటుంబంతో చురుకుగా, ఆరోగ్యంగా జీవించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.
రోజుకు గంట మీ కోసం కేటాయించుకోండి.. జెన్ జీకి ధోని ఫిట్నెస్ సూచన
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan