అప్పటికే పూర్తయిన నియామక ప్రక్రియను మళ్లీ తెరిచి, చట్టబద్ధంగా సర్వీసులో చేరిన ప్రభుత్వ ఉద్యోగిని తొలగించడం సాధ్యం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. డీఎస్సీ-2024 నియామకాలలో మెరిట్ జాబితా ఆధారంగా సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఎంపికై సుమారు పది నెలలు సేవలందించిన సబావట్ వీణను అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం మోరబావి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న వీణను టర్మినేట్ చేస్తూ డీఈవో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. డీఎస్సీ నియామకాల సమయంలో ఆమె కంటే మెరుగైన ర్యాంకు పొందిన మరో అభ్యర్థిపై క్రిమినల్ కేసు ఉండటంతో అతనికి నియామకం ఇవ్వలేదు. అనంతరం ఆ కేసును కోర్టు కొట్టివేయడంతో ఆ అభ్యర్థి నిర్దోషిగా బయటపడ్డాడు.
దీంతో మెరుగైన ర్యాంకు ఉన్న కారణంగా ఆ అభ్యర్థికి ఉద్యోగం కల్పించి, అప్పటికే విధుల్లో ఉన్న వీణను తొలగించారు. ఈ చర్యను సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ కే. శరత్ విచారణ జరిపి, ఉద్యోగం నుంచి తొలగించే ముందు వీణకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని గుర్తించారు. పూర్తయిన ఎంపిక ప్రక్రియను తర్వాతి పరిణామాల ఆధారంగా తిరిగి తెరవడం సరైంది కాదని పేర్కొన్నారు. వీణను ఎనిమిది వారాల్లో తిరిగి సర్వీసులోకి తీసుకుని, ఆమెకు అన్ని సర్వీసు ప్రయోజనాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది.
ముగిసిన నియామక ప్రక్రియను మళ్లీ తెరవడం చెల్లదు.. ఉద్యోగిని తొలగించలేరన్న హైకోర్టు
2