ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరోసారి తన అద్భుతమైన ప్రతిభతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇంటర్ మయామి తరఫున ఆడుతున్న మెస్సీ.. కొలంబస్ క్రూతో జరిగిన మేజర్ లీగ్ సాకర్ మ్యాచ్‌లో అత్యంత క్లిష్టమైన కోణం నుంచి అద్భుతమైన ఫ్రీకిక్ గోల్ చేశాడు. ఈ గోల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్‌లో కొలంబస్ క్రూ 28వ నిమిషంలో ఆధిక్యంలోకి వెళ్లింది. జోసెఫ్ మార్టినెజ్ పెనాల్టీని గోల్‌గా మలిచి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఐదు నిమిషాలకే మెస్సీ తన మ్యాజిక్ చూపించాడు. గోల్‌పోస్ట్‌కు కుడివైపున అత్యంత ఇరుకైన కోణంలో లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ అద్భుతంగా కొట్టాడు. బంతి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లడంతో గోల్‌కీపర్‌తో పాటు మైదానంలోని ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు.
ఈ గోల్‌తో ఇంటర్ మయామి 1-1తో స్కోరును సమం చేసింది. అలాగే ఈ సీజన్‌లో మెస్సీ రెగ్యులర్ సీజన్ గోల్స్ సంఖ్య 21కి చేరింది. అసాధ్యం అనిపించిన కోణం నుంచి మెస్సీ గోల్ చేయడంతో అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. స్టాపేజ్ టైమ్‌లో కొలంబస్ క్రూ మరో గోల్ చేసింది. బ్రైస్ మెండెజ్ కొట్టిన షాట్‌ను మయామి గోల్‌కీపర్ పూర్తిగా నియంత్రించలేకపోయాడు. వెంటనే స్పందించిన జమాల్ థియారే బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో కొలంబస్ క్రూ 2-1తో విజయం సాధించింది.
మెస్సీ మ్యాజిక్.. అసాధ్యం అనుకున్న ఫ్రీకిక్‌తో గోల్.. వీడియో వైరల్
7
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk