పిల్లల అభివృద్ధిలో చదువు ఎంత ముఖ్యమో, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యాలు కూడా అంతే అవసరం. పుస్తక జ్ఞానంతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ప్రాథమిక నైపుణ్యాలను చిన్నప్పటి నుంచే నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈత నేర్పించడం పిల్లలకు ఎంతో ఉపయోగకరం. నీటి లోతు, ప్రవాహాన్ని అంచనా వేయడం, నీటి ప్రదేశాల్లో భద్రతా నియమాలు పాటించడం వంటి విషయాలపై అవగాహన కల్పించాలి. అలాగే పిల్లలకు తమ పూర్తి పేరు, ఇంటి చిరునామా, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు గుర్తుండేలా చేయాలి. అత్యవసర సమయంలో పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సేవలను ఎలా సంప్రదించాలో వివరించాలి.
చిన్న గాయాలను శుభ్రం చేయడం, రక్తస్రావాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవడం వంటి ప్రథమ చికిత్స అంశాలను వయసుకు అనుగుణంగా నేర్పించాలి. టీనేజ్ పిల్లలకు సీపీఆర్ వంటి అత్యవసర సహాయక విధానాలపై శిక్షణ ఇవ్వడం ఉపయోగకరం.
ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బయటకు వెళ్లే మార్గాలు, పొగ నుంచి రక్షణ పొందే పద్ధతులు, లిఫ్ట్ ఉపయోగించకూడదనే విషయాలు పిల్లలకు తెలియజేయాలి. ప్రాథమిక వంట నైపుణ్యాలు, గ్యాస్ స్టవ్ భద్రత, రోడ్డు భద్రతా నియమాలు కూడా నేర్పాలి.
అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం అవసరం. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, లొకేషన్ వివరాలను ఆన్‌లైన్‌లో పంచుకోకూడదని చెప్పాలి.
పరిసరాలను గమనించడం, అనుమానాస్పద పరిస్థితుల్లో పెద్దలకు సమాచారం ఇవ్వడం, తప్పిపోయినప్పుడు ఎలా స్పందించాలో నేర్పడం ద్వారా పిల్లల్లో భద్రతా భావన, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
చదువుతో పాటు పిల్లలకు జీవన నైపుణ్యాలు కూడా అవసరం.. అత్యవసర వేళల్లో ఉపయోగపడే పాఠాలు
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan