హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగర పరిశుభ్రత కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టింది. నిమజ్జన ఊరేగింపులు జరిగిన మార్గాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను ముమ్మరం చేసింది.
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో విగ్రహాల నిమజ్జనం కారణంగా రోడ్లపై పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది. ఈ వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. రెండు రోజుల్లోనే నగరవ్యాప్తంగా 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
అదే సమయంలో మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 13 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. నిమజ్జనాల అనంతరం ఏర్పడిన పేపర్ షీట్లు, ఇతర వ్యర్థాలను తొలగించడంలో శానిటేషన్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ శానిటేషన్ కార్యక్రమం కోసం జీహెచ్ఎంసీ 15 వేల మంది సిబ్బందిని రంగంలోకి దించింది. ఆదివారం సాయంత్రం వరకు నగర శుభ్రత పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
జీహెచ్ఎంసీ వివరాల ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 3 లక్షల 10 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇందులో 66 వేల విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 శాతం ఎక్కువగా విగ్రహాలు నిమజ్జనం అయినట్లు వెల్లడించారు.
హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో నిమజ్జనం చేసిన విగ్రహాల వ్యర్థాలను కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. రెండు రోజుల్లో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ
0