పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళపై అత్యాచారం జరిగిందని, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వదంతులు వ్యాపించడంతో విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు.
సోషల్ మీడియాలో ప్రచారం అయిన ఈ సమాచారంతో సుమారు 2 వేల మంది విద్యార్థులు అర్ధరాత్రి దాటిన తర్వాత గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం హైవేపై కూడా నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఆందోళన సమయంలో కొందరు నిరసనకారులు హాస్టల్ కిటికీలపై రాళ్లు విసిరినట్లు, పూల కుండీలను ధ్వంసం చేసినట్లు సమాచారం. అలాగే కొన్ని ప్రాంతాల్లో నిప్పు పెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల మధ్య చర్చలు నిర్వహించి శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ స్పందిస్తూ, ప్రచారంలో ఉన్న అంశాలు వదంతులేనని స్పష్టం చేసింది. దురుద్దేశంతోనే ఇలాంటి సమాచారం వ్యాపించినట్లు కనిపిస్తోందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు. విద్యార్థి ప్రతినిధులు, యూనివర్సిటీ యాజమాన్యం మధ్య మరోసారి చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు.
మహిళపై అత్యాచార వదంతులు.. పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు
1
Published: 📅
Reported by: 🖊
Sarika Sk